*విశాఖపట్నం* : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ లిక్కర్ షాపు తెరిచి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే లిక్కర్ షాపు తెరవడంలో విశేషం ఏముందని అనుకోవచ్చు కానీ..
అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. చుట్టుపక్క ఏ ఒక్క దుకాణం తెరవలేదు. ఎవర్నీ ఆ రోడ్డు మీదకు అనుమతించలేదు. కానీ ఒక్క లిక్కర్ దుకాణానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అందుకే ఆ మద్యం దుకాణం వ్యవహారం హైలెట్ అవుతోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలోని శారదాపీఠం లో జరుగుతున్న వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. విశాఖ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన చినముషిడివాడలోని శారదాపీఠానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు.
ఈ రోడ్డును భద్రతా కారణాల రీత్యా పోలీసులు బ్లాక్ చేశారు. రోడ్డు రెండు వైపులా బారీకేడ్లు పెట్టారు. ఆ రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను తెరవ వద్దని పోలీసులు ముందు రోజే యజమానాలకు సమాచారం ఇచ్చారు.
సీఎం జగన్ పర్యటన అయిపోయిన తర్వాత దుకాణాలకు తెరిచేందుకు అనుమతిస్తమని చెప్పారు. దానికి తగ్గట్లుగానే యజమానులు ఎవరూ దుకాణాలు తెరవలేదు. దీంతో ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. కానీ ఒక్క దుకాణం తెరిచారు. ఆ దుకాణం వద్ద రద్దీ కూడా ఉంది. అదే మద్యం దుకాణం. ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహిస్తూండటంతో తప్పనిసరిగా తెరిచినట్లుగా కనిపిస్తోంది.
ప్రభుత్వ మద్యం దుకాణం కావడంతో పోలీసులు కూడా ఆ దుకాణాన్ని మూసివేయమని చెప్పలేదు. అదే సమయంలో ఆ దుకాణానికి మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చేవారిని అనుమతించారు. ఇతరులను మాత్రం అనుమతించలేదు.
ఈ మద్యం దుకాణం వీడియో వైరల్ కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇదేనా రామరాజ్యంలో ఓ భాగం అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఇక సోషల్ మీడియా లో ఈ వీడియోను విపరీతంగా వైరల్ అవుతుంది. నిత్యావసర దుకాణాలు, మెడికల్ షాప్స్‌ను కూడా మూసివేయించిన ప్రభుత్వం ఒక్క మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వడమేమిటన్న ఆశ్చర్యం విశాఖ వాసుల్లోనూ కనిపిస్తోంది.
జి. రవి కిషోర్. బ్యూరో చీఫ్