భర్త ను చంపి గొడ్ల చావిడి లో పాతిపెట్టిన భార్య

 *గుంటూరు* :  భార్యభర్తల మధ్య చిన్న వివాదం భర్త హత్యకు దారి తీసింది. గుంటూరు జిల్లా నగరం మండలం పూడివాడ పంచాయతీ పరిధిలోని కాసాని వారి పాలెం కు చెందిన వెంకటేశ్వరావు, 
ఆది లక్ష్మీలకు పద్దెనిమిది ఏళ్ళ క్రితం వివాహమైంది. 

వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. వెంకటేశ్వరావు వ్యవసాయ కూలిగా చేస్తూ మద్యం సేవిస్తుంటాడు. ఈ నెల తొమ్మిదో తేదిన మద్యం సేవించి వచ్చిన వెంకటేశ్వరావుతో, ఆదిలక్ష్మి గొడవ పడింది. 

గొడవ పడుతున్న సమయంలోనే భార్యపై వెంకటేశ్వరావు చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఆదిలక్ష్మి గట్టిగా భర్తను తోసేసింది. భర్తను వెళ్ళి గోడకు బలంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 

ఈ సంఘటన నుండి తేరుకున్న ఆదిలక్ష్మి భర్త వద్దకు వెళ్ళి చూసేసరికి అపస్మారిక స్థితిలో ఉన్న భర్త చనిపోయినట్లుగా గుర్తించింది. ఈ విషయం బయటకు పొక్కకుండా చూడాలనుకొని భర్త శవాన్ని తీసుకొని ఇంటి వెనుక ఉన్న గొడ్ల చావిడిలోకి వెళ్ళింది. 

చావిడిలోనే గుంత తీసి శవాన్ని పూడ్చి పెట్టింది. ఎవరికి అనుమానం రాకుండా మొదటి రెండు రోజులు మొయింటెయిన్ చేసింది. మూడో రోజు దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ప్రశ్నించడం మొదలు పెట్టారు.

 దీంతో ఆదిలక్ష్మి జరిగిన విషయమంతా మామయ్యకు చెప్పింది. వెంకటేశ్వరావు తండ్రి అచ్చియ్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదిలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.

 ఆదిలక్ష్మి చెప్పింది ఎంత మేరకు నిజమో అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులకు లేఖ రాసిన పోలీసులు వారి సాయంతో శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టమ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

 అసలు హత్యకు కారణం ఏంటనే అంశంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.