చెత్తపన్నును రద్దుచేయాలని సిపిఎం పాదయాత్ర

*28న వాల్తేరు సచివాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి.*
జివిఎంసి వై.ఎస్‌.ఆర్‌.సి.పి పాలకవర్గం ప్రజలపై విధించిన చెత్తపన్ను, మురుగునీటిపన్నును తక్షణమే రద్దుచేయాలని సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు, 78వవార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు డిమాండ్‌ చేసారు. 

 ఆదివారం 20, 21వవార్డు చినవాల్తేరు, సిబిఐ డౌన్‌, రెల్లివీధి, రజకవీధిల్లో సిపిఎం వార్డు శాఖ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో గంగారావు పాల్గొని మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరుతో చెత్తపన్ను, మురుగునీటి పన్ను, కొళాయిలకు మీటర్లు వంటి రకరకాల పన్నులు భారీగా విధించి ప్రజలపై భారాలు వేస్తోందన్నారు. ఆస్తిపన్నులో భాగంగానే ఉండేవని తెలిపారు. 

ప్రతి ఇంటికి చెత్తపన్ను నెలకు 120 రూ॥లు, మురుగునీటిపన్ను 50 రూ.లు విధించడాన్ని సిపిఎం పార్టీ ప్రారంభం నుండి వ్యతిరేకిస్తోందన్నారు. జివిఎంసి కౌన్సిల్‌ సమావేశంలో వైసిపి కార్పొరేటర్లంతా దీనిని ఆమోదించుకొని ప్రజలపై భారాలు వేసారు. 

ఇంటిపన్నులు భూమి విలువ మరియు ఇంటి నిర్మాణ విలువపై ఆస్తిపన్నును పెంచడాన్ని తీవ్రంగా ఖండిరచారు. చెత్తపన్ను, మురుగునీటి పన్నును కట్టకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని, చెత్తను తీసుకువెళ్ళమని, కొళాయి కనెక్షన్లు తొలగిస్తామని జివిఎంసి అధికారులు, వైసిపి నాయకులు బెదిరింపులకు దిగడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. 

ప్రజలందరూ ప్రభుత్వం విధించే పన్నులను తిరస్కరించాలని, ఎవరూ చెల్లించకుండా తమ నిరసనను వ్యక్తంచేయాలని పిలుపునిచ్చారు.
28న ఉదయం 10 గంటలకు వాల్తేరు సచివాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు శాఖా కార్యదర్శి పి.వెంకటరావు తెలిపారు.

 ప్రజలందరూ ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసారు. 

ఈ పాదయాత్రలో పార్టీ జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు దండు నాగేశ్వరరావు, అనపర్తి అప్పారావు, ఎస్‌.మాధవస్వామి, ఎల్‌.చిన్నారి, ఎల్లాజీ, కె.కుమారి, ఎం.చంటి తదితరులు పాల్గొన్నారు. 
ఇట్లు
పి.వెంకటరావు
20వార్డు కార్యదర్శి,