రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాల - జనసేన

  *విశాఖపట్నం* :  
                 జాబ్ క్యాలెండర్  విడుదల చేసి ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.

 మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద మంగళవారం పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో  నిరుద్యోగులు, ఉద్యోగులకు  ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి మాట తప్పి మడం తిప్పడం పై  నిరసన కార్యక్రమం   నిర్వహించారు. 


 నిరుద్యోగులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసం పై  ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు  జనవరిలు గడిచిపోయిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం దారుణమన్నారు.

 ఈ ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకొని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచిన యువకులు ,నిరుద్యోగులు తీవ్రంగా మోసపోయారన్నారు. 

మూడేళ్లుగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయకపోగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు ను  వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. 

ఈ పెంపు కారణంగా మరో రెండేళ్ల పాటు కొత్తగా రిటైరయ్యే అవకాశం ఉండకపోవటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టేనన్నారు. ఒకపక్క కొత్త నోటిఫికేషన్ విడుదల చేయక,  మరోపక్క లక్షా 30వేల మంది సచివాలయ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించక ప్రభుత్వం వీరితో చెలగాటమాడుతోందని విమర్శించారు. 

మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకొంటూ  ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల  చేయడంతోపాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ని చెల్లించాలని కోరారు.

 అడగకుండానే యువ న్యాయవాదులు రకరకాల  వృత్తిదారులకు నవరత్నాలు లో భాగంగా ధన సాయం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మాత్రం అన్యాయం చేస్తుందన్నారు.  ఓటర్లలో 42 శాతం వరకు ఉన్న యువతీ యువకులు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 

ఇప్పటికైనా వైఖరి మార్చుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయటంతో పాటు వెంటనే నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచిన నేపథ్యంలో  అదే ప్రాతిపదికన నిరుద్యోగాల వయోపరిమితిని నలభై ఏడు  సంవత్సరాలకు పెంచాలని కోరారు. 

నిరుద్యోగులు పెద్దఎత్తున ఆశ పెట్టుకున్న డీఎస్సీ పైన ప్రభుత్వం చన్నీళ్ళు చల్లుతుందన్నారు. 52 వేల కుపైగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా పాఠశాలల క్రమబద్ధీకరణ పేరిట ఉపాధ్యాయుల ఖాళీలను ప్రభుత్వం దాస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగులతో  భర్తీ చేస్తుందన్నారు. 

ఈ విధానానికి స్వస్తి పలికి నిజాయితీగా ఖాళీలను బహిర్గతం చేసి భర్తీ కి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఎం ఎం ఆర్  టైం స్కేల్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని జగన్ మోహన్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

లేకుంటే నిరుద్యోగ సంఘటితం చేసి ఉద్యమం చేయవలసి వస్తుందని హెచ్చరించారు.

Reporter
సురేశ్