క్రిప్టో కరెన్సీకి అనుమతి? సీఐఐ సూచనలు

క్రిప్టోలను ప్రత్యేక సెక్యూరిటీలుగా పరిగణించాలి
క్రిప్టో ఆస్తులకు రక్షణ కల్పించాలి 
చట్ట పరంగా పన్నులు, ప్రత్యేక నియంత్రణలు అవసరం 
సీఐఐ సూచనలు  

న్యూఢిల్లీ: క్రిప్టోలు లేదా డిజిటల్‌ టోకెన్‌లను ప్రత్యేక తరగతికి చెందిన సెక్యూరిటీలుగా పరిగణించాలని సీఐఐ అభిప్రాయపడింది. వీటికి ప్రస్తుత సెక్యూరిటీలకు అమలు చేస్తున్న నియంత్రణలు, నిబంధనలు కాకుండా.. కొత్త తరహా నియంత్రణలను రూపొందించి, అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రిప్టోల జారీపై కాకుండా.. లావాదేవీలు, భద్రతపైనే నియంత్రణపరమైన దృష్టి ఉండాలని సూచించింది. 
సీఐఐ ఇతర సూచనలు
-  ఆదాయపన్ను చట్టం, జీఎస్‌టీ చట్టాల పరిధిలో క్రిప్టోలు/డిజిటల్‌ టోకెన్‌లను ప్రత్యేక తరగతి సెక్యూరిటీలుగా.. క్యాపిటల్‌ ఆస్తులుగా చూడాలి.
- చట్ట ప్రకారం పన్నులు విధించాలి.
-  ప్రజల ప్రయోజనాల దృష్ట్యా క్రిప్టో/డిజిటల్‌ టోకెన్‌ల జారీపై చట్టబద్ధమైన అధికారం ఆర్‌బీఐకే ఉండాలి. అదే సమయంలో ఆర్‌బీఐ కాకుండా ఇతర ఏ సంస్థ అయినా జారీ చేసేట్టు అయితే అందుకు అనుమతి తీసుకునే విధానం ఏర్పాటు చేయాలి
- ‘కేంద్రీకృత ఎక్సేంజ్‌లు, కస్టడీ సేవలు అందించే సంస్థలు తప్పకుండా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి.
- ఫైనాన్షియల్‌ మార్కెట్‌ ఇంటర్‌మీడియరీలకు మాదిరే కేవైసీ, యాంటీ మనీ లాండరింగ్‌ నిబంధనలను పాటించాలి.
-  ఈ సంస్థలు క్రిప్టోల లావాదేవీలు, వ్యాలెట్ల సేవలను ఆఫర్‌ చేయడానికే పరిమితం కాకుండా.. యూజర్లకు సంబంధించిన క్రిప్టో ఆస్తులకు రక్షణ కల్పించేలా చట్టపరమైన బాధ్యతను తీసుకునేలా చూడాలి. 
- ఈ బాధ్యతకు మద్దతుగా క్రిప్టో ఎక్సేంజ్‌లు కొంత క్యాపిటల్‌ను హామీ నిధిగా నిర్వహించాలి. ఇందుకు సంబంధించి నియంత్రణ సంస్థలు నిర్ధేశించే సమాచార వెల్లడి నిబంధనలను అమలు చేయాలి.
సమావేశాల నేపథ్యంలో
ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే క్రిప్టోలు, అధికారిక డిజిటల్‌ కరెన్సీకి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్‌ ఆమోదం అనంతరం సభ ముందుకు తీసుకొస్తామని ఆమె ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో సీఐఐ సూచనలకు ప్రాధాన్యం నెలకొంది.  
అనుమతిస్తే.. నియంత్రణలకు ముప్పు: సుబ్బారావు 
క్రిప్టో కరెన్సీలను అనుమతిస్తే నగదు సరఫరా, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్‌బీఐకి ఉన్న నియంత్రణాధికారం బలహీనపడుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఎన్‌ఎస్‌ఈ, న్యూయార్క్‌ యూనివర్సిటీ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సంయుక్తంగా నిర్వహించిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడారు. సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ మన దేశంలో అంత బలంగా ఉండకపోవచ్చన్నారు. ‘‘క్రిప్టో అనేది ఆల్గోరిథమ్‌ల ఆధారితంగా ఉంటుంది. వీటివల్ల నగదు సరఫరా, ద్రవ్యోల్బణం నిర్వహణపై కేంద్ర బ్యాంకు నియంత్రణ కోల్పోతుందన్న ఆందోళన ఉంది. మానిటరీ పాలసీకి సైతం క్రిప్టోలు విఘాతం కలిగిస్తాయన్న ఆందోళనలు కూడా ఉన్నాయి’’ అని సుబ్బారావు పేర్కొన్నారు. దేశంలో కరెన్సీ వినియోగం తగ్గిపోతోందంటూ.. డిజిటల్‌ చెల్లింపులు ఆదరణ పొందుతున్నట్టు చెప్పారు.