పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే విషయంలో రాష్ట్రం కూడా పునరాలోచించాలి

   --- టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

           కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో  పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడం అభినందించవలసిన విషయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,   భీమిలి డివిజన్ అద్యక్షులు గంటా నూకరాజు అన్నారు.

            భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన  కరోనా సమయంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధనం ఛార్జీలతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని అన్నారు.  ప్రజల బాధలను దృష్టిలో పెట్టుకొని  కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి పెట్రోల్, డీజిల్ పై  వ్యాట్ రూ. 5 నుండి 10 రూపాయలు తగ్గించడం అభినందవలసిన విషయమని గంటా నూకరాజు అన్నారు.  అదే విధంగా రాష్ట్రాలు కూడా కొంతమేరకు తగ్గించినట్లయితే బాగుంటుందని కేంద్రం సూచించిందని గంటా నూకరాజు అన్నారు.  కేంద్రం సూచనలను దృష్టిలో పెట్టుకొని దేశంలో 9 రాష్ట్రాలు వారికున్న పరిధిని బట్టి తగ్గించాయని,  కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని గంటా నూకరాజు ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.   ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు.  అదేవిధంగా నిత్యం వాడే వంట గ్యాస్ ధరలు కూడా ఎవరూ ఊహించని విధంగా పెరిగాయని, దీనితో సామాన్యులు దగ్గర నుండి ప్రతీ ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  అందువలన కేంద్ర ప్రభుత్వం స్పందించి వంట గ్యాస్ ధరలను కూడా అదుపులో పెట్టాలని సూచించారు.    

           రాష్రంలో ప్రజలు  నిత్యం వాడే అన్ని వస్తువులపై  ధరలు విపరీతంగా పెరిగాయని,  ఒకపక్క కరోనా దెబ్బకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే,  మరోపక్క  పెరిగిన ధరలతో ప్రజలు  కొట్టుమిట్టాడుతున్నారని గంటా నూకరాజు అన్నారు.  ఇలాంటి సమయంలో ప్రజలకు  చేదోడువాదోడుగా ఉండవలసిన ప్రభుత్వాలు ఇంకా ప్రజల రక్తాన్ని జలగల్లా తాగే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.  ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అర్ధం చేసుకుని పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించే ప్రయత్నం చేసాయో అదేవిధంగా  రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించి,  వంట గ్యాస్ పై కూడా ధరలను తగించే విధంగా తగు చర్యలను తీసుకోవాలని గంటా నూకరాజు రాష్ట్ర ప్రభుత్వానికి  ప్రజల తరపున  విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్ భీమిలి
శ్రీనివాస రావు