జాతీయ రహదారి పనుల పురోగతిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

*జనసేవ పత్రికా ప్రకటన*

విశాఖపట్నం

అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారి పనుల పురోగతిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో పనులు జరుగుతున్న తీరుపై మంత్రి ఆరా తీశారు. పనుల్లో కొద్ది శాతం ఉన్న సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ రహదారి పనులు 85 శాతం  పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.  పెందుర్తి-సబ్బవరం బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూసేకరణ  సమస్య వల్ల అలస్యమవుతోందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. 

దీనిపై మంత్రి స్పందిస్తూ.. అనకాపల్లి - ఆనందపురం ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని  అన్నారు. బైపాస్ రహదారి విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి.. డిసెంబర్ నెలకల్లా రహదారి పనులు పూర్తి చేసి.. జనవరిలో రహదారి ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 
ఈ సమీక్షలో ఎన్ హెచ్ఎఐ పీడీ, జనరల్ మేనేజర్, శివశంకర్, ఆర్డీవోలు పెంచల కిశోర్, సీతారామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

యలమంచిలి రిపోర్టర్
Rs నాయుడు